Take a fresh look at your lifestyle.

రోజా ప్లాన్ B – తమిళ రాజకీయాలు?

0 21

రోజా ప్లాన్ B – తమిళ రాజకీయాలు?

ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా ముద్రపడిన మాజీ మంత్రి రోజా, ప్రస్తుతం తన రాజకీయ భవిష్యత్తు కోసం ‘ప్లాన్ బి’ని సిద్ధం చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. నగరి నియోజకవర్గంలో టిక్కెట్ కేటాయింపుపై సస్పెన్స్ కొనసాగుతుండటం, అక్కడ వ్యతిరేక పవనాలు వీస్తుండటంతో ఆమె తన చూపును పొరుగు రాష్ట్రమైన తమిళనాడు వైపు మళ్లించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

 

నగరిలో వైసీపీ క్యాడర్ అంతా వ్యతిరేకమే

 

వచ్చే ఎన్నికల్లో నగరి టిక్కెట్ రోజాకు దక్కుతుందా లేదా అన్నది ఇప్పుడు వైసీపీలో పెద్ద ప్రశ్నగా మారింది. నియోజకవర్గంలో సొంత పార్టీ నేతల నుంచే ఆమెకు తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ఒకవేళ ఏపీలో రాజకీయ అవకాశాలు తగ్గుముఖం పడితే, ఖాళీగా కూర్చోకుండా తన పాత ఇమేజ్‌ను వాడుకుని తమిళ రాజకీయాల్లో పాగా వేయాలని రోజా భావిస్తున్నారు. ఆమెకు అక్కడ ఉన్న నటి గుర్తింపు, పాపులారిటీ ఈ ప్లాన్ బి కి ప్రధాన బలం.

 

డీఎంకేతో ఫెవికాల్ బంధం

 

రోజాకు డీఎంకే అధినేత, ముఖ్యమంత్రి స్టాలిన్ కుటుంబంతో చాలా కాలంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆమెను స్టాలిన్ తన సోదరిగా భావిస్తారు. ఇటీవలి కాలంలో ఆమె తమిళనాడు పర్యటనలు పెరగడం, అక్కడి ప్రభుత్వ కార్యక్రమాల్లో కనిపించడం వెనుక డీఎంకే మద్దతు కూడగట్టుకునే వ్యూహం ఉందని భావిస్తున్నారు. ఏపీలో జగన్ బీజేపీకి సన్నిహితంగా ఉంటే, రోజా మాత్రం దానికి విరుద్ధంగా డీఎంకే వైపు మొగ్గు చూపుతున్నారు. ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.

 

భర్త సెల్వమణి సపోర్ట్

 

రోజా భర్త, ప్రముఖ దర్శకుడు ఆర్.కె. సెల్వమణి తమిళ చిత్ర పరిశ్రమలో రాజకీయాల్లో చురుగ్గా ఉంటారు. ఆయన తరచుగా తమిళ జాతీయవాదానికి మద్దతుగా ప్రకటనలు చేయడం, అక్కడి సమస్యలపై స్పందించడం రోజాకు కలిసొచ్చే అంశం. భర్తకున్న నెట్‌వర్క్, తమిళనాడులోని వివిధ సంఘాలతో ఆయనకున్న సాన్నిహిత్యం రోజాను తమిళ రాజకీయాల్లోకి సాఫీగా ప్రవేశపెట్టేందుకు లాంచ్ ప్యాడ్ గా ఉపయోగపడవచ్చు. తమిళనాడులో సినిమా గ్లామర్ ఉన్న నేతలకు ప్రజలు ఎప్పుడూ బ్రహ్మరథం పడతారు. రోజా అప్పట్లో అక్కడ టాప్ హీరోయిన్ కావడం, స్పష్టంగా తమిళం మాట్లాడగలగడం ఆమెకు ప్లస్ పాయింట్స్.

 

రోజా తన రాజకీయ ప్రయాణాన్ని ఏపీకి మాత్రమే పరిమితం చేయకూడదని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. నగరిలో పరిస్థితులు అనుకూలించకపోతే, తమిళ కోడలిగా అక్కడి ప్రజల ఆశీస్సులు పొంది సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించడానికి ఆమె సర్వం సిద్ధం చేసుకుంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.