*చాక్లెట్ ఆశ చూపి యాసిడ్ తాగించింది…*
*నాలుగేళ్ల బాలుడిపై పిన్ని కర్కశం!*
ఘట్‌కేసర్: కుటుంబ కలహాలు చిన్నారి ప్రాణాలపై దాడికి దారి తీసిన అమానుష ఘటన మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో వెలుగుచూసింది. తన కొడుకును ఇంట్లో చిన్నచూపు చూస్తున్నారనే కారణంతో, తోడి కోడలి నాలుగేళ్ల కుమారుడిపై ఓ మహిళ దారుణానికి ఒడిగట్టింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జ్యూస్ తాగితే చాక్లెట్ ఇస్తానని ఆశ చూపించి బాలుడికి యాసిడ్ తాగించింది. కొద్దిసేపటికే బాలుడు తీవ్ర అస్వస్థతకు గురవడంతో విషయం గమనించిన తల్లిదండ్రులు వెంటనే సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం బాలుడికి వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు సమాచారం.
ఈ ఘటనపై బాలుడి తల్లి మేడిపల్లి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ విభేదాలు ఇంత దారుణానికి దారి తీసిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.